శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): సోలార్ ద్వారా సౌర శక్తిని వినియోగిస్తే భూమిపై కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని దూబే కాలనీ బాలాజీ నెస్ట్ అపార్ట్మెంట్ లో 8 లక్షల 40 వేలతో నూతనంగా ఏర్పాటు చేసిన 14 కేవీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సహజ వనరులను ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. తగ్గిపోతున్న వనరుల తరుణంలో సహజ సిద్ధమైన సౌర శక్తిని వాడుకుని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. 14 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన బాలాజీ నెస్ట్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ని కార్పొరేటర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, సురేష్, బాలాజీ నెస్ట్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఆంజనేయులు యాదవ్, విజయ్ భాస్కర్, విజయ్ కుమార్, కిరణ్, మురళి, దేవేందర్, ఝాన్సీ, జాషువ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.