శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశ వ్యాప్తంగా జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఏఐసీసీ, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి నేతృత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం చేవెళ్ల, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మదీనగూడా కిన్నెర గ్రాండ్ హోటల్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి జనరల్ సెక్రటరీ, కనెక్ట్ సెంటర్ ఇంచార్జ్ దుర్గం భాస్కర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి నియోజకవర్గ జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ టీపీసీసీ కోఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సందేశంను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామన్నారు. ఈ మూడు సూత్రాల మీద దేశం మొత్తం కార్యక్రమం జరుగుతుందని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.