శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వ్యవస్థాపకుడు మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి పక్షోత్సవాల సందర్భంగా ముజఫర్ అహ్మద్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు హాజరై ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓంకార్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 17 నుంచి 31 వరకు ప్రస్తుత రాజకీయాలు మార్క్సిజం, అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై సభలు, సదస్సులు జరుగుతున్న సందర్భంగా వికారాబాద్ లో ఓంకార్ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలియజేశారు.
ప్రస్తుత రాజకీయాలలో అవినీతి అక్రమాలు ప్రలోభాలు రాజ్యమేలుతున్నాయని, నీతి నిజాయితీ విలువలు కనుమరుగై ప్రజలకు చెందాల్సిన సంపదను పెట్టుబడుదారులు పాలకులు మమేకమై దోచుకు తింటున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారని ఇలాంటి పరిస్థితులలో విలువలతో కూడిన ప్రజా జీవితాన్ని గడిపి కష్టజీవులకు కావలసిన అవసరాలైన భూమి, భుక్తి, ఉపాధి, విద్యా వైద్యం తదితర సౌకర్యాలు కల్పించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మద్దికాయల ఓంకార్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఓంకార్ ఆదర్శాలను, ఆశయాలను పునికి పుచ్చుకొని దోపిడిదారులైన పెట్టుబడిదారులకు భూస్వాములకు వారికి అండగా నిలిచే పాలకులకు వ్యతిరేకంగా వర్గ సామాజిక ఉద్యమాలను నెలకొల్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం అనిల్ కుమార్, ఎం రాములు, ఎం రాజు, రవీందర్ రెడ్డి, అంగడి పుష్ప, తుడుం పుష్పలత, ఇందిరా శివాని, సుల్తానా బేగం, రజియా బేగం, శ్రీలత, చెన్నమ్మ, సుజాత, విజయ చందర్ వీరమణి తదితరులు పాల్గొన్నారు.