ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

  • బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పది, ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలి: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
  • ఉత్సాహంగా 2కే రన్.. ఓటర్లతో ప్రతిజ్ఞ 

నమస్తే శేరిలింగంపల్లి : ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో 2కె రన్ నిర్వహించారు.

కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో 2కె రన్ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

 

ఉత్సాహంగా సాగిన ఈ 2కే రన్ లో అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్లు, యువత, దివ్యాంగులు, వాకర్స్ అసోసియేషన్స్, సైకిలిస్ట్ అసోసియేషన్స్, పోలీసులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు.

కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి ప్రారంభమైన 2కె రన్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్, ప్రకాశంవంతమైన దేశం కోసం ఓటేయాలనే అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పరుగులో పాల్గొన్నారు.

ఓటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్న దృశ్యం

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, స్వేచ్ఛయుతంగా నైతిక ఓటింగ్ చేయాలని సూచించారు. పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై క్షేత్ర పరిధి పరిశీలనతో చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. బాధ్యతగల పౌరులుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని,”సి”విజిల్ యాప్ ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల లోపు విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 2 కె రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోవారిని, చుట్టుపక్కల వారిని తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరచాలన్నారు.

2కే రన్ లో మొదటగా వచ్చిన ఐదుగురికి బహుమతుల ప్రదానోత్సవం

జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ, బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పదని, మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్ శాతం లో 50శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతమైనప్పటికీ, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ, ఓటు వేయడంలో నిరాసక్తత చూపుతున్నారన్నారు. ఓటర్ జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈ నెల 15 లోగా ఫారం – 6 లో దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు హక్కు ఉన్న అందరూ మే 13న జరుగు పోలింగ్ ప్రక్రియలో పాల్గొని నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేయాలని , అదేవిధంగా మిగతా వారిని చైతన్య పరచాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, శేరిలింగంపల్లి పెద్ద నియోజకవర్గమని, ఏడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, ఆదాయం, చదువులోనే కాదు, సామాజిక బాధ్యతలో కూడా ముందున్నామని నిరూపించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఓటర్ సర్వీస్ పోర్టల్ లో ఓ టర్లు తమ వివరాలను చెక్ చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా ఇంటిలో, ఆఫీసులలో, బంధువులు, స్నేహితుల వద్ద ఓటు వేయడం పై మాట్లాడి అవగాహన కల్పించి అందరూ ఓటేసేలా చైతన్యం చేయాలని కోరారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. 2కే రన్ లో టాప్ గా వచ్చిన 5 గురికి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిభా సింగ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, ఏసిపి, ఆయా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here