- బీజేపీని గెలిపించి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు తెచ్చుకోండి
- తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు
- ఎంఐఎంతో కలిసి తెరాస జనాలను మోసం చేస్తోంది
- యూపీలో 15 లక్షల ఇళ్లు ఇచ్చాం, తెలంగాణలో ఎన్ని ఇచ్చారు ?
- సీఎం కేసీఆర్‌కు సీఎం యోగి సూటి ప్రశ్న
- అవినీతి లేని హైదరాబాద్ కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపు
కూకట్‌పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి శనివారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కూకట్‌పల్లిలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను ప్రజలకు ఇచ్చిందని, 6 ఏళ్ల పాలనలో తెరాస ప్రజలకు ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు ఎందుకు ఇళ్లు కట్టివ్వడం లేదని ప్రశ్నించారు.
కేంద్రంలో ఎన్‌డీయే హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని సీఎం యోగి అన్నారు. హైదరాబాద్ వాసులు జమ్మూ కాశ్మీర్‌లోనూ ప్లాట్లు కొనుక్కుని ఇళ్లు కట్టుకోవచ్చని, ఇదంతా ప్రధాని మోదీ చలవే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌ను సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే గొప్ప పథకం అదని పేర్కొన్నారు.
వరద బాధితులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సహాయం జమ చేయకుండా నగదు రూపంలో ఎందుకు ఇచ్చారని సీఎం యోగి ప్రశ్నించారు. ఆ నగదు నేరుగా తెరాస కార్యకర్తల జేబుల్లోకే వెళ్లిందన్నారు. నిజాంకు వ్యతిరేకంగా ఆనాడు సర్దార్ పటేల్ పోరాటం చేశారని, ఆయన స్ఫూర్తితో నయా నిజాంపై మనం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నయా నిజాం ఆలోచనలను సాగనివ్వకూడదన్నారు. ఎంఐఎంతో కలిసి తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. భారత్‌లోనే ఉంటూ.. ఇక్కడే తింటూ.. హిందుస్థాన్ అనమంటే ఎందుకు అనడం లేదని.. దీన్ని ఇంకెంతకాలం భరించాలని అన్నారు.
ఎంఐఎం బెదిరింపులను భరించేది లేదన్నారు. నగరవాసులతో కలిసి పోరాటం చేసేందుకు తాను ఇక్కడికి వచ్చానన్నారు. హైదరాబాదీల ఉత్సాహం చూస్తే ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. తెలంగాణలో తండ్రీ కొడుకులు కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, అలాంటి మోసగాళ్లు, దోపిడీగాళ్లకు స్థానం లేదని అన్నారు. వ్యాపారులను భయపెట్టడంపై ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేయడంలో లేదన్నారు.
భాగ్యనగర నిర్మాణం కోసం బీజేపీ కృషి చేస్తుందని, అవినీతి లేని హైదరాబాద్ కావాలంటే బీజేపీకి ఓటు వేసి ప్రజలు బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. గ్రేటర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం యోగి అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.