- మహిళలకు ఆటల పోటీలు
- విజేతలకు బహుమతులు అందజేసిన ముఖ్యఅతిథులు
నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎంవీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటల పోటీలు నిర్వహించారు. చందానగర్ డివిజన్ పరిధిలో ని సరస్వతీ విద్యా మందిర్ వద్ద నిర్వహించిన ఈ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులుగా ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి (హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ) మూలా వెంకటేష్ గౌడ్ (ఛైర్మన్, ఎంవీఆర్ గ్రూపు) బహుమతులను అందజేశారు. అంతేకాక శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 80 మంది మహిళా నాయకురాళ్ళను శాలువా, బహుమతితో సత్కరించారు.
అనంతరం ఆచార్య విజయలక్ష్మి మాట్లాడారు. కాలానుగుణంగా స్త్రీ సమూహంలో చైతన్యం కన్పిస్తుందని, అబల అనే అర్థానికి సబల అనే అర్థానికి మధ్యస్తంగా నేటి స్త్రీ తనను తాను నిర్మించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో తన శక్తి సామర్థ్యాలను నిర్భయంగా ప్రదర్శించుకోగలుగుతుందని తెలిపారు. అయినప్పటికీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ” స్త్రీలలో ఇంకా వెనుకబాటుతనం ఉందని, దానిని అధిగమించాలని, స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గొట్టిముక్కల బ్రహ్మానందం, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజయలక్ష్మి, వరలక్ష్మి, సుభద్ర, కల్పన, అమ్మయ్య చౌదరి, వెంకటేశ్వర్లు, పాలం శ్రీను, శ్రీనివాస్ పాల్గొన్నారు.