మగవారికి మాత్రమే వచ్చే ఈ కాన్సర్ గురించి విన్నారా..?

  • ముందుగానే గుర్తిస్తే ఎంతో మేలు

మగవారిలో పొత్తికడుపులో చివర భాగంలో చిన్న బాదంపప్పు రూపంలో ఉండే ఒక గ్రంథి ప్రొస్టేట్.  ఇది మూత్రాశయంను ఆనుకొని ఉంటుంది.  దీనిని డిజిటల్ రెక్టం పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.  ఈ ప్రొస్టేట్ గ్రంథి కి వచ్చే క్యాన్సర్ ను ప్రొస్టేట్ క్యాన్సర్ అని పిలుస్తారు.

భారత్ లో ప్రొస్టేట్ క్యాన్సర్

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి వారు 2019 లో విడుదల చేసిన లెక్కల ప్రకారం భారత్ లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రతి లక్ష మందిలో 9-10 మందికి వస్తోందని ఇది ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాలతో పోలిస్తే ఎక్కువ అమెరికా లేదా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే తక్కువ అని తెలుస్తోంది.  భారత దేశంలో పాశ్చాత్య దేశాల కన్నా తక్కువ క్యాన్సర్ కేసులున్నప్పటికీ నానాటికీ మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆయుర్థారం కారణంగా మన దేశంలోనూ కేసులు పెరుగుతూ ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.  ఇలా పెరుగుతున్న కేసులలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటి.

అంతే గాకుండా ఇటీవల జరిగిన పలు పరిశోధనల ప్రకారం దక్షిణ భారతం కన్నా ఉత్తర భారతంలో ఈ కేసులు సంఖ్య ఎక్కువ.  అయినప్పటికీ 2002 నుండి 2006 మధ్య తీసిన లెక్కల ప్రకారం చెన్నయి నగరంలో 47 శాతం పెరిగిందని తెలియడం గమనార్హం.  అలానే పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా కేసుల సంఖ్య తేడాలున్నాయని తెలుస్తోంది.  పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో దీనిపై అవగాహన లేకపోవడం కారణమని చెప్పవచ్చు.

ప్రొస్టేట్ క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు – భారత దేశ పరిస్థితి

భారతదేశం ఎంతో భిన్నమైనది.  మతాలు, సాంప్రదాయాలు, వాతావరణం, అక్షరాస్యత మరియు ఆహారపు అలవాట్లు అనేవి ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటాయి.  ఇంతటి భిన్నత్వం కలిగిన దేశంలో అందుకు తగినట్లే ప్రొస్టేట్ క్యాన్సర్ లెక్కులలో కూడా మనకు భిన్నత్వం కనిపిస్తుంది.  ముఖ్యంగా కుటుంభంలో క్యాన్సర్ ఉన్న చరిత్ర, షుగర్ వ్యాధి ఉండడం, సరైన ఎత్తు బరువు లేక పోవడం, ఊబకాయం, పొగ త్రాగడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం తో పాటూ కుటుంభ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడం వంటి పలు కారణాలు ఈ క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  దీంతో పాటూ గతంలో పొగ త్రాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి ఉన్నా ఇందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక మన దేశంలో ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మరియు అనుబంధ విభాగాలలో పని చేసే వారే.  ఈ పనిలో నిమగ్నం అయిన వారు వ్యవసాయంలో వినియోగించే పలు రసాయిక ఎరువులు, మందుల ప్రభావానికి లోనవుతున్నవారే.  దీని వలన వీటిలో ఉండే విషపూరితమైన కార్సోజెనిక్ పదార్థములు మానవ శరీరానికి క్యాన్సర్ కలుగజేస్తాయని ఇప్పటికే నిరూపితమైన అంశం.  ఇక ప్రొస్టేట్ క్యాన్సర్ ఈస్ట్రోజన్ ఆధారిత క్యాన్సర్ లలో ఒకటి కాబట్టి ఈ విషపూరిత కార్సోజనిక్ పదార్థముల కారణంగా వీరిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండే అవకాశముంటుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ ను గుర్తించడం ఎలా…

ప్రొస్టేట్ లో ఏర్పడే గడ్డలు లేదా కణుతులు క్యాన్సర్ కు సంబంధించినవైనా కావచ్చు లేదా ఇతరత్రా గడ్డలు కావచ్చు.  బినైన్ గడ్డలనబడే ఇతరత్రా కణితులు కారణంగా ప్రాణానికి ప్రమాదం ఉండదు. ఇవి ఇతర శరీర భాగాలకు పాకవు మరియు వీటిని శస్త్ర చికిత్స ద్వారా తీసి వేయవచ్చు.  సాధారణంగా ఇవి మరళా ఏర్పడవు అంతే గాకుండా ప్రొస్టేట్ గ్రంధి పై ఉన్న చర్మపు టిష్యులను పాడు చేయవు.  అయితే ఈ మాలిగ్నంట్ కణుతులుగా పిలువడే క్యాన్సర్ కణుతులు లేదా గడ్డలు ప్రాణానికే ప్రమాదంగా మారుతాయి.  ఇవి చుట్టుప్రక్కల ఉన్న చర్మపు కణాలను పాడు చేయడమే కాకుండా ఇతర శరీర భాగాలకు పాకుతాయి.

ఇక ప్రొస్టేట్ లో ఏర్పడే క్యాన్సర్ కణాలు తొలుత ఏర్పడిన కణితి నుండి విడివడి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ ద్వారా చేరి సరి కొత్త కణుతులు నిర్మాణం చేస్తాయి.  ఆయా శరీర భాగాలలో ఏర్పడే ఈ సరికొత్త కణుతులు అక్కడున్న భాగాలకు ప్రమాదం చేకూరుస్తాయి.  అయినప్పటికీ ఈ కణుతుల ప్రారంభం ప్రొస్టేట్ నుండి జరిగింది కాబట్టి ఈ మొత్తం వ్యాప్తిని ప్రొస్టేట్ క్యాన్సర్ అని గుర్తించి చికిత్స అందించడం జరుగుతుంది.

వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు.  ముందుగా ప్రొస్టేట్ గ్రంథిలో వాపు కనిపిస్తుంది.  అంతే గాకుండా మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.  వీటితో పాటూ క్రింద పేర్కొన్న మరికొన్న లక్షణాలు ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపించవచ్చు…

1.  ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం.

2.  మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు, నొప్పి, మంట లేదా మూత్రం సరిగ్గా రాకపోవడం

3.  మూత్రంలో రక్తం రావడం

4.  లైంగిక సంపర్క సమయంలో మంటల

5.  కడుపు పై భాగంలో, వెనుక వెపు నొప్పి తో పాటూ తొడలలో నొప్పి

6.  పొత్తి కడుపు క్రింది భాగంలో నొప్పి

7.  ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం

8.  ఎముకలలో నొప్పి

వ్యాధి నిర్థారణ

ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష మరియు డిజిటల్ రెక్టల్ ఎక్జామినేషన్ అనే రెండు పరీక్షలను చేయడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ ను నిర్థారణ చేస్తారు.  వీటి ద్వారా వ్యాధిని ముందుగానే పనిగట్టవచ్చు.  అయితే ఈ రెండు రకములైన పరీక్షలలో వచ్చే ఫలితాలు కొన్ని సందర్భాలలో ఇతరత్రా ఇన్ఫెక్షన్ వలన కూడా అయ్యే అవకాశం ఉంటుంది.  అటువంటి ఇబ్బంది ఉన్నపుడు మరింత ఖచ్చితత్వానికి వైద్యులు బయాప్సీ పరీక్ష చేస్తారు.  వీటితో పాటూ రోగి కుటుంభ చరిత్ర తో పాటూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలను గుర్తించి బయాప్సీ ద్వారా వ్యాధిని ఖచ్చితంగా నిర్థారిస్తారు.  నిర్థారించిన పిమ్మట వైద్యులు మీ శరీరం యొక్క స్కాన్ చేయమని సూచిస్తారు.  దీని ద్వారా వ్యాధి కేవలం ప్రొస్టేట్ గ్రంధికే పరిమితంగా ఉందా లేదా శరీరంలోని ఇతరత్రా భాగాలకు పాకిందా తేలుతుంది.

చికిత్స

ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారికి ముందుగా శస్త్ర చికిత్స సూచిస్తారు.  శస్త్ర చికిత్స తో పాటూ వ్యాధి పరిస్థితి, శరీరంలో వ్యాప్తిని అనుసరించి రేడియేషన్ థెరపీ, కైరో థెరపీ, ఫోకల్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమో థెరపీ, ఇమ్యూనో థెరపీ వంటి వాటిని ఉపయోగించి వైద్యులు చికిత్స చేయడం జరుగుతుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ – మనుగడ రేటు

ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిన మగవాళ్లందరూ క్యాన్సర్ కారణంగా చనిపోరు.  వారి మరణాలన్నీ ఇతరత్రా కారణాల ద్వారానే జరుగుతాయి.  ఆధునిక వైద్య పరిజ్ఞానం పెరిగిన నేపధ్యంలో ప్రొస్టేట్ క్యాన్సర్ కు అందుబాటులోనికి వచ్చిన అత్యాధునిక చికిత్స కారణంగా చనిపోవడం అరుదుగా జరుగుతోంది.  షుమారు 99 శాతం మంది ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులు చికిత్స పొందిన తర్వాత కనీసం 5 సంవత్సరములకు పైగా బ్రతుకుతున్నారు.  ఎక్కువ శాతం పూర్తిగా నయం చేసుకొంటున్నారు.  ఎందుకంటే ఇతర క్యాన్సర్ ల వలే ప్రొస్టేట్ క్యాన్సర్ ను కూడా ముందుగా గుర్తించడం వలన ప్రమాదం తప్పుతుంది కాబట్టి.  ఇతర శరీర భాగాలకు ప్రాకినప్పటికీ ఇలా జరిగిన ప్రతి ముగ్గురిలో ఒకరు పూర్తిగా రోగం నుండి విముక్తులవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

కొన్ని సందర్భాలలో క్యాన్సర్ తిరిగి రావచ్చు.  అయితే దీని ప్రభావం ఎంత అనేది క్యాన్సర్ తీవ్రత ను బట్టి ఉంటుంది.

చికిత్స కన్నా వ్యాధిని నిరోధించడమే మేలు

ఇతర అన్ని రోగముల వలే వ్యాధి వచ్చిన తర్వాత దాని ఫలితాలపై చర్చించడం కన్నా వ్యాధి రాకుండా చూసుకోవడమే హితం అని వైద్య నిపుణులు పేర్కొంటారు.  ఈ కోవలోనే ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి. మంచి పౌష్టికాహారం తీసుకోవడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, పొగ మరియు ఆల్కహాల్ సేవనకు దూరంగా ఉండడం వంటి మంచి అలవాట్ల తో జీవించడం అత్యంత ఆవశ్యకం.  తద్వారా క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా మిమ్ములను మీరు కాపాడుకోవచ్చు.

Article is written by

Dr. Priyank Salecha, Urologist & Andrologist (Male), Apollo Spectra Hospital, Kondapur

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here