- రెవెన్యూ అధికారుల అండదండలతోనే చెరువు పూడ్చివేత
- కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ స్థలాలను, చెరువులను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులకు అండగా నిలబడుతూ ప్రోత్సహిస్తున్నారని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి మండల పరిధి గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 71/1 71/2 సుమారు 5 ఎకరాల 30 గుంటలు విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈద్గావానీ కుంట ను జయవేరి సంస్థ రాత్రికి రాత్రి వందల కొద్ది టిప్పర్లతో చెరువు పూడ్చి వేస్తున్నారని తనకు సమాచారం రావడంతో.. సోమవారం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ తో కలిసి కబ్జాకు గురైన చెరువును పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయభేరి సంస్థ చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామనే పేరుతో రాత్రికి రాత్రి కబ్జా చేస్తున్నారని, దీనికి పూర్తి బాధ్యత స్థానిక రెవెన్యూ అధికారులదైనని, కేంద్రం అండతోనే ఈ ఆక్రమణలకు పూనుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులకు అండగా నిలబడుతూ ప్రోత్సహిస్తున్నారని, వారికి సమాచారం ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా కబ్జాదారులను వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంపై తాము ఇరిగేషన్ అధికారులకు, తహసీల్దార్ , జిల్లా కలెక్టర్ కు, స్థానిక జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారులను నిలదీస్తే ఇక్కడ పట్టాదారులు ఉన్నారని తాము పట్టాదారులు జోలికి వెళ్ళమని, కబ్జా చేయడానికి పోసిన మట్టికి పెనాల్టీ వేసామని, వారిపై కేసులు కూడా బుక్ చేశామని చెప్తున్నారని తెలిపారు. దాదాపు 300 కోట్ల విలువగల చెరువు స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువును పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి ప్రోత్బలంతోనే ఈ కబ్జా పర్వం కొనసాగుతుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, జయభేరి సంస్థపై కఠిన చర్యలు తీసుకునే వరకు స్థానిక ప్రజా ప్రతినిధిగా పోరాటం చేస్తానని తెలిపారు.