- మియాపూర్ లో ఇండ్ల చోరీ నిందితుల అరెస్ట్…రూ.12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
మియాపూర్,మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): దుర్య్వసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఇండ్లలో చోరీ చేయడాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు ఇద్దరు యువకులు. మూడు నెలల వ్యవధిలోనే ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడి పెద్దమొత్తంలో బంగారం, నగదును దోచుకున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఇరువురినీ మియాపూర్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దాదాపు రూ.12 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు, మియాపూర్ ఎసిపి కృష్ణ ప్రసాద్ లు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదీనాగూడ ఉషోదయ ఎన్‌క్లేవ్‌కు చెందిన తాళ్లూరి ప్రసన్న కుమార్ వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కాగా జనవరి 18వ తేదీన వ్యాపారం నిమిత్తమై కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి కూకట్‌పల్లి ప్రాంతానికి వెళ్లాడు. మధ్యాహ్నం ప్రసాద్ అనే వ్యక్తికి ఇంటి తాళం చెవులు ఇచ్చి శుభ్రం చేయమని పంపగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు, బీరువా తలుపులు తెరిచి ఉండి, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ప్రసన్నకుమార్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి చేరుకున్న ప్రసన్నకుమార్ దొంగతనం జరిగినట్లు గ్రహించి మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్ కు చెందిన మహమ్మద్ మొయిజ్(26) పెయింటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(24) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పరిచయమైన వీరు మద్యం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మియాపూర్, మాదాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ముందుగా ద్విచక్ర వాహనంపై రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించిన అనంతరం ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టడం, కిటికీ గ్రిల్స్ ను తొలగించి దొంగతనాలు చేయసాగారు.
సిసి కెమెరాల ఆధారంగా చోరీలకు పాల్పడుతున్న నిందితులను మహమ్మద్ మొయిజ్, మహమ్మద్ ఇబ్రహీంలుగా గుర్తించిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఆదిత్యనగర్‌లోని వారి నివాసాల్లో నిందితులను అరెస్ట్ చేసి విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు. నవంబరు నెలలో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ఇంటి చోరీలో రెండు తులాల బంగారంతో పాటు కొంత నగదు, డిసెంబరు మూడవ వారంలో కొండాపూర్‌లో రెండు తులాల బంగారంతో పాటు ఇరవై వేల నగదు తో పాటు రెండు చేతిగడియారాలు, జనవరి మొదటి వారంలో కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో అర తులం బంగారం, 25 తులాల వెండి వస్తువులతో పాటు కొంత నగదు, జనవరి మూడవ వారంలో మదీనాగూడ హెచ్ఐజిలో 8 తులాల బంగారంతో పాటు వెండివస్తువులు, నగదు, జనవరి మూడవ వారంలో కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో 40 వేల నగదుతో పాటు స్యామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌తో పాటు ప్రసన్న కుమార్ ఇంటిలో 35 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుండి 35 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, 10వేల రూపాయల నగదుతో పాటు బజాజ్ పల్సర్ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా వీరిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని, వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వీరిరువురిపై పిడి యాక్ట్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఇన్స్‌పెక్టర్ సామల వెంకటేష్, డిఐ మహేష్‌గౌడ్, సబ్ ఇన్సపెక్టర్ రవికిరణ్ లతో పాటు పోలీసు సిబ్బందిని ఎసిపి అభినందించారు.