శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతికి ఊళ్లకు వెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండాలని మియాపూర్ సీఐ క్రాంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు తమ అడ్రస్, ఫోన్ నంబర్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలని అన్నారు. ఇంటి తాళం చెవులను ఎట్టి పరిస్థితిలోనూ పూల కుండీలు, డోర్ ర్యాక్స్, మ్యాట్స్ కింద పెట్టవద్దని, ఇంటి తాళం చెవులు, విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా వాహనాలను రోడ్డు మీద కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయాలని, వాహనాల డిక్కీల్లో విలువైన వస్తువులను పెట్టకూడదని, పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలని, ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు.
డీవీఆర్ కనిపించకుండా ఇంట్లో రహస్య ప్రదేశంలో పెట్టాలని, ఊరికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని, పోలీసులకు సహకరిస్తే చోరీలను నియంత్రించడం సులభతరం అవుతుందని సూచించారు.