శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్ పరిధిలోని అరుణోదయ కాలనీలో ఉన్న శ్రీ నిర్వాణ హోటల్‌లో ఈ నెల 7వ తేదీన నిమ్మ వంశీకృష్ణారెడ్డి (25) అనే యువకుడు రూమ్ తీసుకున్నాడు. తాను జాబ్ కోసం వచ్చానని తెలిపాడు. ఈ నెల 8వ తేదీన అతను తన హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వంశీకృష్ణారెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అందుకనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.