నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో అన్నమ స్వరార్చన కార్యక్రమాన్ని అన్నమ గాయత్రి, అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభించారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని ద్వారా శిక్షణ పొందిన పద్మశ్రీ శోభారాజు విద్యార్థిని, గాయత్రి సింధూజ వేదుల అన్నమయ్య సమేత శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి “గణరాజ గుణరాజ, వందేహం గురుదేవ, అదిహో అల్లదిహో, మేడలక్కి, అప్పమైన నీయరే, సకలబలంబులు నీవే, విష్ణుడొక్కడే, ఆకాశమడ్డమా, అన్ని మంత్రములు, పొడగంటిమయ్య, ఉయ్యాలా బాలునూచెదరు” అనే ప్రఖ్యాత అన్నమయ్య సంకీర్తనలను తన మృదు మధుర గానమృతంతో అందరి మెప్పు పొందింది.
ఈ కార్యక్రమానికి సత్యదేవ్ కీబోర్డుపై, బి.వి.రమణమూర్తి వాయిద్య సహకారం అందించారు. తదనంతరం సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు కళాకారులని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చారు. పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.