18 కిలోల గంజాయిని పట్టించిన బస్ కండక్టర్‌కు డీసీపీ రితిరాజ్ సన్మానం

శేరిలింగంప‌ల్లి, జూన్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): అప్రమత్తతతో వ్యవహరించి 18 కిలోల గంజాయి రవాణాను అడ్డుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కండక్టర్‌ను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ సన్మానించి నగదు ప్రోత్సాహకం అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న రాత్రి సుమారు 8 గంటల సమయంలో హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఔరంగాబాద్‌కు వెళ్లేందుకు ఆరుగురు వ్యక్తులు షిర్డీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ లగేజీ బ్యాగ్‌ను ఎక్కించే ప్రయత్నం చేశారు. బ్యాగ్‌పై అనుమానం వచ్చిన బస్ కండక్టర్ అందులో ఉన్న వస్తువుల గురించి వారిని ప్రశ్నించగా, వారు సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో కండక్టర్ ఆ బ్యాగ్‌ను మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సమాచారం అందించాడు. పోలీసులు పంచనామా నిర్వహించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని తూకం వేయగా, అందులో సుమారు 18 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గంజాయిని రవాణా చేయడానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గంజాయి రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన బస్ కండక్టర్‌ను డీసీపీ రితిరాజ్ శాలువాతో సత్కరించి నగదు బహుమతి అందజేసి అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here