శేరిలింగంపల్లి, అక్టోబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): పాపిరెడ్డి కాలనీలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో విద్యుత్ పరివర్తకంపై పతంగిని తీసుకునేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన బాలుడు గడ్డప్పకు అండగా ఉంటామని శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి సామెల్ కార్తీక్ తెలిపారు. మూగ, వినికిడి వైకల్యం కలిగిన బాలుడు ప్రమాదానికి గురైన వెంటనే పాఠశాల సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారని, అధికారులు స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రణామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ ద్వారా ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు.

బాలుడి ప్రమాదాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం చేశారని సామెల్ కార్తీక్ ఆరోపించారు. పాఠశాల ఆవరణలో రాజకీయ కండువాలతో నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులతో అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో తాను విద్యుత్ పరివర్తకం ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ, అప్పటి బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టి దానిని ఏర్పాటు చేయించారని సామెల్ కార్తీక్ పేర్కొన్నారు. ఇప్పుడు అదే అంశంపై ప్రజా ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తనపై భౌతిక దాడికి ప్రయత్నించారని, తాను ఒంటరిగానే వారిని ప్రతిఘటించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఘటన సమయంలో పోలీసులు తొలుత నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పోలీసుల తీరుపై స్థానికులు, మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
బాధిత బాలుడికి అన్ని విధాలా అండగా ఉంటామని సామెల్ కార్తీక్ హామీ ఇచ్చారు. అవసరమైన సహాయం అందించడంతో పాటు, అవసరమైతే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్‌తో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. బాలుడి ప్రాణాలు, ఆరోగ్యం, భవిష్యత్తు మనందరికీ ముఖ్యం. ఇలాంటి ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదు. వీలైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సామెల్ కార్తీక్ విజ్ఞప్తి చేశారు.





