శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవులపల్లి రామకృష్ణారెడ్డి (34) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. సెప్టెంబర్ 28న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నవలయపల్లి గ్రామానికి చెందిన దేవులపల్లి విష్ణువర్ధన్ రెడ్డి (63) తన కుమారుడి అదృశ్యంపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణారెడ్డి గత మూడేళ్లుగా చందానగర్‌లోని పద్మజ కాలనీలో నివాసం ఉంటూ పటాన్‌చెరులోని APR సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 28న ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణారెడ్డి ఆ రోజు విధులకు కూడా హాజరు కాలేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు చందానగర్‌కు చేరుకుని బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు. అతను ఉపయోగించే రెండు ఫోన్ నంబర్లకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలిపారు. అతను సుమారుగా 5.4 అడుగుల ఎత్తు ఉంటాడని, తెలుపు రంగు ఛాయ అని, ముఖం గుండ్రంగా ఉంటుందని, తెలుగు, ఇంగ్లిష్ భాషలు వచ్చని, చివరిసారిగా తెల్లని షర్ట్, బ్లూ జీన్స్ ధరించాడని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.





