శేరిలింగంపల్లి సమస్యలపై గాంధీ సమీక్ష.. తాగునీరు, డ్రైనేజీ పనులకు ప్రాధాన్యత

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారంతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జలమండలి ED సంతోష్ రెడ్డి, GMలు కృష్ణ, హరిశంకర్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ కాలనీల ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని, ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు.

ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేయడంతో పాటు స్వచ్ఛమైన నీరు అందేలా చూడాలని గాంధీ అధికారులకు సూచించారు. నీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సరఫరాలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమగ్ర, సమతుల్య అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్‌లో అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గాంధీ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో UGD పైప్‌లైన్లు, తాగునీటి పైప్‌లైన్ పనులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని, అత్యవసర పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొనసాగుతున్న పనుల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించిన గాంధీ.. అసంపూర్తిగా ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీపడకూడదని, సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

కాలనీల్లో మురుగునీరు పొంగిపొర్లకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని గాంధీ ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చోట పాత పైపులను మార్చాలని, కొత్త పైప్‌లైన్ల అవసరం ఉన్న ప్రాంతాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జలమండలి అధికారులు DGM నారాయణ, DGM శ్రీనివాస్ రాజు, DGM నరేందర్, DGM శ్రీహరి, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here