శేరిలింగంపల్లి, అక్టోబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. మూడు జోన్ల పరిధిలో సీఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. బుధవారం చేపట్టిన తనిఖీల్లో 16 అనధికార నిర్మాణాలను గుర్తించగా.. 17 కూల్చివేతలు చేపట్టారు. మరో రెండు కేసుల్లో నోటీసులు జారీ చేశారు.

జోన్‌ల వారీగా కూల్చివేతల వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 6 నిర్మాణాలను కూల్చివేయగా, కూకట్‌పల్లి జోన్‌లో 4, కుత్బుల్లాపూర్‌లో 7 కూల్చివేతలు చేపట్టారు. మూడు జోన్లలో సీఎంసీ బృందాలు అనధికార నిర్మాణాలు, భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను గుర్తించి, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడుతున్నట్లు సీఎంసీ వెల్లడించింది. గుర్తించిన ప్రతి కేసును నిర్దేశిత విధానం ప్రకారం పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అనధికార నిర్మాణాలను నియంత్రించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు, ఫాలోఅప్ చర్యలు నిరంతరం కొనసాగుతాయని సీఎంసీ పేర్కొంది.






