శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్లో అసంపూర్తిగా ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి పనులతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు.

తారానగర్ ప్రధాన రహదారి విస్తరణలో చిరు వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు వెడల్పును 100 అడుగుల నుంచి 80 అడుగులకు కుదించినందుకు కమిషనర్ సృజనకు రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుల్మోహర్ పార్క్ నుంచి విద్యానికేతన్ మోడల్ స్కూల్ వరకు ప్రతిపాదించిన నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి రోడ్డు వెడల్పును 120 అడుగుల నుంచి 100 అడుగులకు కుదించాలని కమిషనర్‌ను కోరారు. ఈ విజ్ఞప్తిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రాగం తెలిపారు. కాగా శేరిలింగంపల్లి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.ఆర్. పవన్ కుమార్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు ఈ నెల 10న నిర్వహించనున్న బతుకమ్మ కార్యక్రమానికి హాజరు కావాలని కమిషనర్ సృజనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





