శేరిలింగంపల్లిలో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించగా, అనంతరం సేవా జ్యోతి యాత్ర ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్, జిల్లా ఇన్‌చార్జి ఆలె భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ అనంతరం క్రిస్టల్ గార్డెన్స్ నుంచి చందానగర్ స్వాగత్ హోటల్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, 2014 తర్వాత దేశ ప్రధానమంత్రిగా నేటి వరకు నరేంద్ర మోదీ సుమారు 25 ఏళ్లుగా ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 2014కు ముందు దేశ పరిస్థితి, ప్రస్తుతం మోదీ పాలనలో భారత్ సాధించిన ప్రగతిని ప్రజలు పరిశీలించాలని కోరారు. మౌలిక వసతులు, తయారీ రంగం, డిజిటల్ విప్లవం, విద్య, వైద్యం తదితర రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సమాజంలోని పేద వర్గాలకు చేరుతున్నాయని అన్నారు. జన్‌ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ సేవలను పేదలకు చేరువ చేశామని, ఉజ్వల యోజన ద్వారా కోట్లాది కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించామని తెలిపారు.

జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరా, పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సేవలకు భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సంక్షేమ పథకాల కారణంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు. మోదీ పాలన స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం, పదవి కోసం కాకుండా ప్రజల కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా దేశ ప్రయోజనం కోసం కొనసాగుతోందని రవికుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త, పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజిత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, సింధు రెడ్డి, బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అర్జున్, మల్లేష్, వెంకటేష్‌తో పాటు బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here