చింతల్ సర్కిల్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న‌ చింతల్ సర్కిల్‌లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పౌర మౌలిక వసతులను పరిశీలించారు. ఐడీపీఎల్ జంక్షన్‌ను సందర్శించిన కమిషనర్.. జంక్షన్ అభివృద్ధి పనులతో పాటు ఫ్రీ లెఫ్ట్ టర్న్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నిర్ణీత ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయా అనే అంశంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీనివాస నగర్‌లోని హిందూ, ముస్లిం శ్మశాన వాటికలను కమిషనర్ సందర్శించారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. వన్ డే.. వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. చేపట్టిన పనులపై నిరంతరం ఫాలోఅప్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here