శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఘన సన్మానం నిర్వహిస్తూ, రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి డివిజన్‌కు చెందిన యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్, సీనియర్ నాయకుడు మల్లికార్జున శర్మల సంయుక్త ఆధ్వర్యంలో లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులకు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు, న్యాయం పూర్తిస్థాయిలో జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల స్వరాష్ట్ర పాలనలోనూ ఉద్యమకారులు అనేక సందర్భాల్లో నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా అంగీకరించినట్లు గుర్తు చేశారు.

అయితే పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ఏదో ఒక రూపంలో అవకాశాలు వస్తాయనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా వారిని గెలిపించేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు సామ వెంకట్ రెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, వెంకట్ యాదవ్, మల్లారెడ్డి, నగేశ్, విజయలక్ష్మి పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొబ్బ నవత రెడ్డి, సతీష్ ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కార్తీక్, విజయ్ రెడ్డి సాన, సంతోష్ నాయుడు, సంతోష్ రెడ్డి తదితరులు, యువ నాయకులు పాల్గొన్నారు.





