మాదాపూర్ పోలీసుల సాంకేతికతకు మరో విజయం.. రూ.10 లక్షల విలువైన 50 మొబైల్ ఫోన్లు రికవరీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సుమారు 50 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలుగా పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించారు. ఫోన్ల IMEI నంబర్ల ఆధారంగా వాటి ఆచూకీని గుర్తించి, నిరంతర ఫాలోఅప్‌, ధ్రువీకరణ ప్రక్రియ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.

అనంతరం అవసరమైన ధ్రువీకరణ, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కూకట్‌పల్లి జోన్ డీసీపీ సమక్షంలో బుధవారం ఆయా యజమానులకు అప్పగించారు. చాలా రోజుల తర్వాత తమ విలువైన మొబైల్ ఫోన్ల‌ను తిరిగి అందుకోవడంతో యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ మాదాపూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్లను గుర్తించి తిరిగి అందించడంలో పోలీసులు చూపిన చొరవను వారు అభినందించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి జోన్ డీసీపీ, మాదాపూర్ పోలీసుల కృషిని అభినందించి, CEIR పోర్టల్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన సిబ్బందిని ప్రశంసించారు.

మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మాదాపూర్ పోలీసులు సూచించారు. ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్, ఇతర వివరాలను అందిస్తే CEIR వ్యవస్థ ద్వారా ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేసే ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here