శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): కస్టమర్ కేర్ నంబర్ అని నమ్మి గూగుల్‌లో కనిపించిన ఫోన్ నంబర్‌కు కాల్ చేసిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. కేటుగాళ్లు క్రెడిట్ కార్డుల నుంచి ఏకంగా రూ.2,00,215.82 నగదును కాజేశారు. చందానగర్‌కు చెందిన మద్దుకూరి సుబ్రహ్మణ్యం అక్టోబర్ 2న సాయంత్రం 5.30 గంటల సమయంలో T Wallet యాప్‌లో KYC పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గూగుల్‌లో సెర్చ్ చేయగా 9155211694 నంబర్ కస్టమర్ కేర్ నంబర్‌గా కనిపించింది. దీంతో సుబ్రహ్మణ్యం ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు.
ఫోన్ ఎత్తిన వ్యక్తి తన పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం KYC పూర్తి చేసేందుకు CS APP (కస్టమర్ సర్వీస్ యాప్)ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయాలని సూచించాడు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన అనంతరం కొంతసేపు వేచి ఉండాలని చెప్పాడు. అయితే ఎలాంటి OTP లేదా ఇతర సందేశం రాలేదు. ఫోన్ కాల్ ముగిసిన వెంటనే తన AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు, RB843 బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి నగదు డెబిట్ అయినట్లు సుబ్రహ్మణ్యానికి సందేశాలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అతను సంబంధిత క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌ను సంప్రదించి రెండు కార్డులను బ్లాక్ చేయించాడు. అయితే అప్పటికే 10 లావాదేవీల ద్వారా మొత్తం రూ.2,00,215.82 నగదు మోసగాళ్ల ఖాతాలకు వెళ్లిపోయింది.
ఈ ఘటనపై సుబ్రహ్మణ్యం సైబర్ క్రైమ్ ఫిర్యాదు నంబర్ 33710260051993తో అక్టోబర్ 4న ఫిర్యాదు చేశాడు. అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ ద్వారా మోసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గూగుల్‌లో కనిపించిన 9155211694 నంబర్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన SMSలు, సైబర్ క్రైమ్ ఫిర్యాదు వివరాలను పోలీసులకు ఆధారాలుగా అందజేశాడు. మోసగాళ్లను గుర్తించి తన డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు.





