శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అనులుపై బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తను వైఖరి స్పష్టంచేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మూడు పార్టీలు అగ్రవర్ణ దోపిడీ పార్టీలుగా వ్యవహరిస్తూ బీసీలను నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్ దుర్గయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలరాజ్ గౌడ్ తో పాటు రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తో కలసి మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను తుంగలో తొక్కి బీసీలను మరోసారి రేవంత్ రెడ్డి సర్కారు నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనులుచేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 17శాతానికి తగ్గించి తీవ్ర అన్యాయం చేశారన్నారు. అయినా బీసీ ఉద్యమం ఫలితంగా బీసీలు చైతన్యవంతులై జనరల్ స్థానాల్లో సైతం సగానికిపైగా గెలువడం శుభపరిణామనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్ వస్తే, మరుసటిరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడతామన్నారు. ఈ యాత్రలో భాగంగా బీసీలను మరింత చైతన్యవంతం చేసి గ్రామపంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బిసిలు పోటీ చేయాలని పిలుపునిస్తామన్నారు. అగ్రవర్ణాలు బిసి రిజర్వేషన్లపై కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిసి రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కాంగ్రెస్, బిజెపిల పై ఒత్తిడి పెంచేలా పోరాడుతామన్నారు. బిసిల రిజర్వేషన్లపై స్పందించకుండా బిఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం విమర్శించుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. కృష్ణా జలాలపై మాట్లాడుతున్న కెసిఆర్ కు బిసిల రిజర్వేషన్లపై మౌనంగా ఉండటం విచారకరమన్నారు. బిసిలు 42శాతం రిజర్వేషన్లు సాధించేంతవరకు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్స్ బైరు శేఖర్ గంగపుత్ర , యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, గోలి గిరి రజక, సింగం నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.





