శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంజీర మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నల్లగండ్ల కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో కొత్త మంజీర పైప్‌లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ పనులతో దీర్ఘకాలంగా ఉన్న నీటి కొరత సమస్యకు ముగింపు పలుకుతున్నామని అన్నారు. ఇకపై ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షితమైన, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 18 రిజర్వాయర్లు నిర్మించామని, అవసరమైన చోట్ల పవర్ బోర్ల ద్వారా కూడా నీటి సరఫరా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చడం, ప్రతి కుటుంబానికి నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





