పీఎం స్వనిధి కింద సైబరాబాద్‌లో ఆధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్‌లు

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో ప్రధానమంత్రి స్వనిధి (పీఎం స్వ‌నిధి) పథకం కింద ఆధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ హబ్‌ల ద్వారా వీధి వ్యాపారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అనిల్ ప్రకాష్, విజయవాడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన జయేష్ కుమార్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి కమిషనర్ సృజ‌న‌, అదనపు కమిషనర్ (యూసీడీ)లతో సమావేశమయ్యారు. స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ అంశాలపై వారు సమగ్రంగా చర్చించారు.

ప్రతిపాదిత హబ్‌లలో పరిశుభ్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు, కుటుంబాలు సహా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపై విభిన్న రకాల ఆహారాన్ని ఆస్వాదించేలా సదుపాయాలు కల్పించనున్నారు. స్ట్రీట్ ఫుడ్ హబ్‌లకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, క్రీడాకారుల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో సూచించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి, సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ టాయిలెట్లు, అంతర్జాతీయ ప్రమాణాల తాగునీటి సౌకర్యాలు, పరిశుభ్రత సూచికల ఆధారంగా స్టాళ్ల పర్యవేక్షణ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా నిర్వహణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

ప్రతి వారం సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల కళలు, సంగీతం, నృత్యం, వంటకాల వైవిధ్యాన్ని ప్రజలకు పరిచయం చేసేలా ఈ హబ్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల ద్వారా వీధి వ్యాపారులకు స్థిరమైన ఉపాధి, స్థానిక వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం, ప్రజలకు పరిశుభ్రమైన, ఆకర్షణీయమైన ప్రజా వేదికలు అందుబాటులోకి వస్తాయని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత మల్కం చెరువు ప్రాంతాన్ని బృందం సందర్శించి, పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం, ప్రత్యేక బస్సు సౌకర్యాల ఏర్పాటుపై కూడా చర్చించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here