ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి: ఏఐఎఫ్‌డీఎస్

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): న‌గ‌రంలోని ఓంకార్ భవన్‌లో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్‌డీఎస్) తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యా-వైజ్ఞానిక శిక్షణ తరగతులు రెండో రోజు ప్రిన్సిపాల్ వి. భ‌రత్ అధ్యక్షతన కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఏఐఎఫ్‌డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయని, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యకు ప్రోత్సాహం ఇస్తున్నారని పేర్కొన్న ఆయన, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది, డీఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా నడిపిస్తోందని మేత్రి రాజశేఖర్ విమర్శించారు. విద్యా వ్యవస్థలో మతోన్మాద ధోరణులను ప్రోత్సహించే విధంగా విధానం ఉందని ఆరోపిస్తూ, ఎన్‌ఈపీ-2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో పదేపదే జరుగుతున్న పేపర్ లీకేజీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని అన్నారు. నీట్ పరీక్ష వ్యవస్థ పూర్తిగా విఫలమైందని పేర్కొంటూ, పేపర్ లీకేజీలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం నీట్ పరీక్షలు అవినీతి, పేపర్ లీకేజీలు, అక్రమాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ తగిన సంస్కరణలు చేపట్టడం లేదని విమర్శించారు. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, మరోవైపు పేపర్ లీకేజీ మాఫియా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో అసలు నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి జబ్బర్, కోశాధికారి పోతుగంటి కాశీ, రాష్ట్ర కమిటీ సభ్యులు టికంటి కుమార్, మార్త నాగరాజు, సందీప్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here