కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంగణంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రాజెక్టు ఆఫీసర్ సురేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మాదాపూర్ సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన 5,950 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు స్వయం ఉపాధి రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు పలు సంక్షేమ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, ఆర్థిక సహాయం, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్నతరహా కార్మికులు, గృహ కార్మికులు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని పిలుపునిచ్చారు. మహిళల ఆదాయ వృద్ధికి దోహదపడే విధంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు తదితర వ్యాపార కార్యకలాపాల బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎల్లమ్మబండలో త్వరలోనే మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మహిళల అభివృద్ధే కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వశక్తితో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పెద్ద మధుసూదన్ రెడ్డి, గుమ్మడి శ్రీనివాస్, జంగయ్య యాదవ్, రాంచందర్, మామిడాల రాజు, కేవీ రావు, పరమేశ్వర్, మెప్మా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here