శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు హైదర్‌నగర్ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రశాంతి హిల్స్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ వెర్టెక్స్ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా వెర్టెక్స్ అపార్ట్మెంట్స్, కొలను రాఘవ రెడ్డి గార్డెన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కేపీహెచ్‌బీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ గౌతమీనగర్ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనులు నిర్వహించనున్నారు. దీంతో గౌతమీనగర్, శ్రీనివాస్ కాలనీ, లేక్ వ్యూ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ పనుల కారణంగా వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని హైదర్‌నగర్ ఆపరేషన్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) విజ్ఞప్తి చేశారు.





