మార్తాండ‌ నగర్ బస్తీ వాసులకు శాపంగా మారిన రోడ్డు డివైడర్

శేరిలింగంప‌ల్లి, జూన్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్లే రహదారిపై న్యూ హఫీజ్‌పేట్ పరిధిలోని మార్తాండ‌ నగర్ బస్తీకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గించి వాహనాలు సులభంగా ప్రయాణించాలనే ఉద్దేశంతో డివైడర్ ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అది బస్తీ ప్రజలకు సమస్యల కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ కారణంగా మార్తాండ‌ నగర్ బస్తీలోకి వెళ్లే స్కూల్ బస్సులు, అత్యవసర సేవల వాహనాలు, ఇతర భారీ వాహనాలు నేరుగా వెళ్లలేకపోతున్నాయి. దీంతో సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకుని తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు.

ఇటీవల బస్తీలోని ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగిన ఘటనలో కూడా ఈ సమస్య తీవ్రంగా బయటపడింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఫైర్ ఇంజన్ నేరుగా రాకపోవడంతో మూడు కిలోమీటర్లు తిరిగి వచ్చి ఘటనాస్థలానికి చేరుకోవాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం వృథా అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ నాయకులు, బస్తీ వాసులు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి రోడ్డు డివైడర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, అత్యవసర సేవలు, ప్రజల రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here