శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను అధికారులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పౌరులు తమ సమస్యలు, సూచనలను నేరుగా కమిషనర్ సృజన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. శాఖాధిపతుల సమక్షంలో ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. వాటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 40 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ విభాగానికి 4, ఎస్టేట్స్ విభాగానికి 1, పారిశుద్ధ్య విభాగానికి 1, అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి 1 ఫిర్యాదు అందాయి. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీతోపాటు ట్రాకింగ్ లింక్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారులు తమ వినతుల పురోగతిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

సంబంధిత శాఖలు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని శాఖాధిపతులకు సూచించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పౌర సేవలను అందించడం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.





