శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సోమవారం ఉదయం చింతల్ సర్కిల్ పరిధిలోని రంగానగర్లో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించి పౌర సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యూఏలు), వ్యాపారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్డబ్ల్యూఏ సభ్యులు ప్రధాన అంతర్గత రహదారిపై చిప్పింగ్ పనులు చేపట్టడంతోపాటు అనుసంధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరచాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులకు ప్రాధాన్యత ఆధారంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా గుర్తించిన నీటి నిల్వ ప్రాంతాలను వెంటనే పరిష్కరించాలని సూచించిన కమిషనర్, టౌన్ ప్లానింగ్, మెయింటెనెన్స్ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి అవసరమైన చర్యలను అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ డస్ట్బిన్లను వినియోగిస్తున్న పౌరులు, వ్యాపారులను కమిషనర్ అభినందించారు. వాణిజ్య ప్రాంతాల్లో పరిశుభ్రత పెంపొందించేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్డబ్ల్యూఎం) విభాగం చేపట్టిన నో బిన్ – నో ట్రేడ్ అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు. రోడ్లపై చెత్త వేయకుండా ఇంటింటికీ చెత్త సేకరణ సేవలను వినియోగించాలని పౌరులు, వ్యాపారులకు సూచించిన కమిషనర్, సాట్ ఆటో డ్రైవర్లు నిర్ణయించిన రూ.100 వినియోగదారుల రుసుమును మాత్రమే వసూలు చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ సేవలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటికి వేగంగా పరిష్కారాలు అందించడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించడమే కార్పొరేషన్ లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.





