- జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరాలు
- తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జంట నగరాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికల తెరాస మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ నుంచి జంట నగరాల ప్రజలకు రోజుకు 24 గంటల పాటు ఉచితంగా మంజీరా నీటిని సరఫరా చేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సెలూన్లు, దోబీఘాట్‌లకు డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్‌ను అందజేస్తామన్నారు. అలాగే జీహెచ్ఎంసీలోని అన్ని వాణిజ్య సముదాయాలకు (థియేటర్లతో సహా) మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కనీస విద్యుత్ చార్జిలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వ్యాపారులు, థియేటర్ల యాజమాన్యాలు బాగా నష్టపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
సినీ ఇండస్ట్రీకి కూడా సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో సినిమాలు లేక, థియేటర్లు నడవక ఖాళీగా ఉంటున్న సుమారుగా 40వేల మంది చిత్ర పరిశ్రమ కార్మికులతోపాటు 15వేల మంది జూనియర్ ఆర్టిస్టులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫాంలను చిత్ర పరిశ్రమలోని సంఘాల సహాయంతో తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలోని థియేటర్లను తెరుచుకునేందుకు యజమానులకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు థియేటర్ల యాజమాన్యాలు ఇకపై రోజుకు ఎన్ని షోలనైనా వేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, టిక్కెట్ల ధరలను కూడా సవరించుకునేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. దీంతోపాటు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించే వారికి రాష్ట్ర జీఎస్‌టీ నుంచి రీయెంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఇక మెట్రో రెండో దశను కూడా త్వరలో పూర్తి చేస్తామని, ఎయిర్‌పోర్టు నుంచి మెట్రోకు లింక్ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో మోటారు వాహనాలను నడుపుకునే వారికి ఇబ్బందులు కలిగిన దృష్ట్యా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు పన్నును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
దేశంలో కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఇతర మెట్రో నగరాల్లోనూ వరదలు వస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీకి గతంలో వివరించామని, అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామన్నారు. డిసెంబర్ నుంచి మళ్లీ వరద సహాయం పంపిణీ చేస్తామన్నారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావచ్చన్న హైకోర్టు సూచనలతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గత 7 ఏళ్ల కాలంలో హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని, మత కల్లోలాలు, అల్లర్లు లేకుండా ప్రజలు ఎంతో సుఖంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకే నగరంలో అతి పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించామన్నారు. దేశంలోనే ఈ సెంటర్ అతి పెద్దదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గ్రేటర్‌లోనే కాదు.. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. మహిళలపై వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడేవారికి ఎలాంటి శిక్షలు విధించామో ప్రజలకు తెలుసని, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం రాజీ పడేది లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర ఏ పార్టీ గెలిచినా వృథాయే అని, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి ఉంది కనుక ప్రజలు అభివృద్దిని కోరుకుంటే తెరాసకే ఓటు వేసి గెలిపించాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అందరి హైదరాబాద్ కావాలా ? కొందరి హైదరాబాద్ కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.