హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వం గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదని, అలాంటిది కొత్తగా వాగ్దానాలను ఎలా ప్రకటిస్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం 2016 లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలనే ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. కొత్తగా తెరాస పార్టీ ఎన్నికల వాగ్దానాలను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలనే ఇప్పుడు కూడా ప్రకటించారని అన్నారు.
హైదరాబాద్ వరదల్లో 40 మంది చనిపోతే ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందని, ప్రజలు ఎవరూ బాగుపడలేదని ఆరోపించారు. ఆరున్నర ఏళ్లలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని విషాదనగరంగా మార్చారని విమర్శించారు. సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఆరున్నర ఏళ్లలో వరద నీటి నిర్వహణ పనులను సరిగ్గా చేపట్టలేదన్నారు. పాత బస్తీలో ఓట్లను అడిగే హక్కు తెరాస, మజ్లిస్‌లకు లేదన్నారు.