చౌటుప్పల్, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): పిల్లలకు ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం అనే భాగ్యాన్ని అందించాలని, ప్లాస్టిక్, గుట్కా, గుడుంబాల నిషేధానికి నడుం బిగించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని హరిత పారిశ్రామిక పార్కులో రమణి డాక్టర్ ప్రసాద్ లు నెలకొల్పిన రమణి బయో కాంపోస్టికా పరిశ్రమను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ నిత్యం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. మనం వాడుకొని పారవేసిన ప్లాస్టిక్ సంచులు భూమిలో కరిగేందుకు ఎనిమిది వందల సంవత్సరాలు పడుతుందని, పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశ్రమలో మొక్కజొన్న పొట్టుతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ సంచులు భూమిలో 90 రోజుల్లోనే కరిగిపోతాయని పర్యావరణానికి పశువులకు ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అంచెలంచెలుగా ప్లాస్టిక్ ను, గుట్కాను, గంజాయిని పూర్తిగా నిషేధించాలని దీనికి యువత నడుంబిగించాలని కోరారు. వ్యాపారం కోసం కాకుండా సమాజానికి తమ వంతు సహాయం చేసేందుకు బయో సంచుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసిన రమణి డాక్టర్ ప్రసాద్ దంపతులను ఆయన అభినందించారు.