నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ పట్ల టీఆర్ఎస్ ప్లీనరీ సభా వేదిక నుంచి స్పష్టమైన ప్రకటన చేయాలని ఏఐబీఎస్ఎస్ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచుతామని వాగ్దానం చేసిందని ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో చిత్తశుద్ధితో కొట్లాడి సాధించడంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి జీ ఓ జారీచేయడంలో గాని టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే ప్లీనరీ సమావేశంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఖచ్చితమైన ప్రకటన చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 6 నుండి 9.8 శాతానికి గిరిజన జనాభా పెరిగిందని, నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను పెంచక పోవడంతో గిరిజనులు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో తీవ్రంగా నష్టపోయారన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 16(4 ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పెంచుకునే అధికారం ఉందన్నారు.2017లో జరిగిన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకుందని వాపోయారు. అది కూడా బిసి (ఇ) రిజర్వేషన్ పెంపు అంశాన్ని కలిపి ఒకే తీర్మానం పంపడం సమస్య మరింత జటిలం కావడం, కేంద్ర ప్రభుత్వం సైతం తీర్మానం బాగా లేదని కేంద్ర హోంశాఖ వెనక్కి పంపకుండా ఈ బిల్లును పరిశీలించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కు పంపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతూ గిరిజనులను మోసం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్నందున గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్లీనరీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.