నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మరింత ప్రగతిని సాధించవచ్చని, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ ఆర్ ఆర్) పూర్తయితే దేశంలో ఏ నగరం హైదరాబాద్ తో పోటీ పడలేదని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరం తొలిరోజునే నగరంలో కొత్తగా నిర్మించిన షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. షేక్ పేట్ ఫ్లై ఓవర్ నగరంలోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ అని, దీంతో ట్రాఫిక్ సమస్యలకు చాలా వరకు చెక్ పెట్టవచ్చన్నారు. నగరంలో చార్మినార్, గోల్కొండ సహా ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, హెరిటేజ్ సిటీగా హైదరాబాద్‌ను గుర్తించేలా చూడాలని అన్నారు. రసూల్ పురాలో కొంత భూమి కేంద్రం ఆధీనంలో ఉందని, దానిని ఇప్పించాలని కిషన్ రెడ్డిని కోరారు. కంటోన్మెంట్‌లో 21 రోడ్లను మూసివేశారని, వాటిని తెరిపించేలా కృషి చేయాలని, స్కైవేల నిర్మాణానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు స్కైవేలు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర రక్షణశాఖను భూములు ఇవ్వాలని కోరినా స్పందించడం లేదన్నారు. ఎస్ ఆర్ డీపీ కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీలో పెద్దఎత్తున రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామన్నారు.
నగరంలో పెద్దఎత్తున లింక్ రోడ్లు నిర్మించామని, 132 కొత్త లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజినల్ రింగ్ రోడ్‌ను కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఆర్ ఆర్ ఆర్ పూర్తయితే దేశంలో ఏ నగరం కూడా హైదరాబాద్ కు పోటీ రాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా అందరం కలిసి పనిచేద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు జాతీయ రహదారులు వచ్చాయని అన్నారు. సైన్స్ సిటీ కోసం స్థలం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్టుగా చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నట్టుగా తెలిపారు. కుతుబ్ షాహీ టూంబ్స్ కోసం నిధులు విడుదల చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.