నమస్తే శేరిలింగంపల్లి: యువతీ యువకులు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని ఏఐఎఫ్ డీవై గ్రేటర్ కమిటీ సభ్యులు భూసాని రవి డిమాండ్ చేశారు. ఏఐఎఫ్డీవై 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోగుల ఆగయ్య నగర్ లో సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఏఐఎఫ్ డీవై ఏర్పడి 22 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో అనేక యువజన, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పోరాడుతుందన్నారు. ఓంకార్ నగర్ లో ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ నాయకులు టి. నర్సింగ్ జెండాను ఆవిష్కరించారు. యన్. నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువతి విభాగం నాయకురాలు ఎండి సుల్తానా, రాజేష్, దార లక్ష్మి, విమల, శివాని, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
