శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టేందుకు కుట్రలు పన్నుతుండటంపై మండిపడ్డారు. హెచ్ సీయూ భూములను అమ్మాలని చూడటం అన్యాయమని ధ్వజమెత్తారు. యూనివర్సిటీ భూములను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హెచ్ సీయూ యూనివర్సిటీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 400 ఎకరాల భూములను వేలం వేయాలనే ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పరిధిలోని పచ్చని చెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పాల్పడటం కరెక్ట్ కాదన్నారు. ఆదివారం వర్సిటీ ప్రాగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసేందుకు పాల్పడ్డారని, అడ్డు వచ్చిన విద్యార్థులపై ఇష్టారాజ్యంగా దాడులు చేయడంపై రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులతో ఆటలు ఆడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసుల ద్వారా భయ పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించాలనే కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎకరాలను వేలం వేయాలనుకునే నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని రవీందర్ యాదవ్ హెచ్చరించారు.