కలసి జ‌ట్టుగా పని చేస్తేనే డయాబెటిస్ నియంత్ర‌ణ సాధ్యం

డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి కణాలలో సంభవించే జీవ క్రియకు ఏర్పడే రుగ్మత. రక్తంలోని గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయి పెరగడం లేదా తగ్గడం వలన ఎక్కవ శాతం ప్రజలలో దీనిని గమనించవచ్చు. దీని కారణంగా ప్రధాన అవయవాలైన మూత్ర పిండాలు, నరాలు, కళ్లు, గుండె, మెదడుతో పాటు రక్తనాళాలు ప్రభావితమై పలు మార్పులకు లోనవుతాయి. మన భారత దేశంలోనే 77 మిలియన్ ప్రజలు డయాబెటిస్ తో బాధ‌పడుతున్నారని లెక్కలు చెబుతుంటే ఈ సంఖ్య రానున్న 20 సంవత్సరాలలో 150 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

డయాబెటిస్ ప్రధానంగా మన జీవితంలో పాటించే జీవనశైలి కారణంగా వస్తుంది. అత్యంత తక్కువ శారీరక శ్రమ, ఇష్టానుసారం ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి ఆధునిక జీవన శైలిలో ఏర్పడిన అనారోగ్య విధానాల కారణంగా ఇది వస్తుందని తేలింది. అలానే కుటుంబంలో తల్లితండ్రులకు డయాబెటిస్ ఉన్నపుడు వారి పిల్లలో కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వచ్చే ప్రమాద ముందని నిపుణులు చెబుతుండగా అందులోనూ ఎక్కువ బరువున్న పిల్లలలో ఇది ఎక్కువ గా కనిపించే ప్రమాదం ఉందని వారు వివరిస్తున్నారు. దీంతో పాటు గర్భధారణ సందర్భాలలో పలువురు మహిళలకు గెస్టేషనల్ డయాబెటిస్ కనిపిస్తుండగా, హైపర్ టెన్షన్ తో బాధ‌పడే వారిలో లేదా లిపిడ్ లో ఉండే అసాధారణ మార్పులు ఉన్న వారితో పాటు స్టెరాయిడ్ వంటి మందులు వాడే వారిలో కూడా ఈ వ్యాధి వస్తోంది.

వ్యాధి కారణంగా ఏర్పడే ప్రమాదాలు…
సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఆహారం తీసుకోకముందు 110mg/dl చక్కెర స్థాయిలు ఉండాల్సి ఉండగా, ఆహారం తీసుకొన్న 2 గంటల తర్వాత 140 mg/dl చక్కెర స్థాయి ఉంటుంది. అయితే ఈ చక్కెర స్థాయి ఆహారం తీసుకోకముందు 126mg/dl ఉండి తీసుకొన్న తర్వాత 200 mg/dl గా చక్కెర స్థాయిలు నమోదు అయితే వారికి డయాబెటిస్ ఉన్నట్లు భావిస్తారు. ఇక ఆహారం తీసుకోక ముందు చక్కెర స్థాయిలు 110-126 mg/dl మధ్య ఉన్నా లేదా ఆహారం తీసుకొన్న తర్వాత చక్కెర స్థాయిలు 140-199 mg/dl మధ్య ఉన్నా వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదమున్న వారిగా గుర్తించి తగిన జాగ్రత్తలతో చికిత్స అందిస్తారు. తద్వారా వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించి తద్వారా వారికి ఏర్పడే హృద్రోగ సమస్యలు రాకుండా చూడవచ్చు.

డయాబెటిస్ రుగ్మత ప్రారంభమైన వ్యక్తులలో ఆకలి ఎక్కువగా ఉండడం, దాహం ఎక్కువగా వేస్తుండడం, బరువు తగ్గడం, నీరసం, అలసి పోవడం, ఎక్కువగా చర్మ, మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్లు రావడంతోపాటు గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. అయితే ఎక్కువ శాతం డయాబెటిస్ వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు కూడా కనిపించకుండా ఏదైనా ఒక సందర్భంలో వారికి రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు నిర్వహించినపుడు మాత్రమే బయటపడడం కూడా గమనించవచ్చు. ఇలా లక్షణాలు లేని వారే ఎక్కువగా డయాబెటిస్ కారణంగా ఏర్పడే పలు ఇతర సమస్యలకు లోనవుతుంటారు.

అందుకే డయాబెటిస్ ఏర్పడే ప్రమాద సూచికలో ఉన్న వారు నియమిత కాలంలో అంటే కనీసం 6 నెలలకు ఒక సారి క్రమం తప్పకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోవాల్సి ఉంటుంది.

డయాబెటిస్ వలన వచ్చే ఇబ్బందులు…
డయాబెటిస్ కారణంగా ఏర్పడే ఇబ్బందులలో డయాబెటిక్ రెటినోపతి కారణంగా కంటి చూపు కోల్పోవడం, మూత్ర పిండాలు విఫలం కావడంతోపాటు గుండెకు రక్త సరఫరా చేసే నాళాలలలో ఏర్పడే ఇబ్బందుల‌ కారణంగా గుండె సంబంధిత ఇబ్బందులు ఏర్పడడంతోపాటు డయాబెటిస్ ఫుట్ అల్సర్స్ (డయాబెటిస్ కారణంగా కాలిలో ఏర్పడే పుండ్లు) వలన కాలు తీసి వేయాల్సి రావడం వంటి వాటిని ప్రధానంగా పేర్కొనవచ్చు.

అందుకే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్న వారు కింద పేర్కొనబడిన అంశాలలో చెప్పబడిన పరిమితులలో ఉండేటట్లు చూసుకోవాలి.

* ఆహారం తీసుకోక ముందు చక్కెర స్థాయి < 120 mg/dl కన్నా తక్కువగా ఉండడం
* ఆహారం తీసుకొన్న తర్వాత చక్కెర స్థాయి < 160 -180 mg/dl ల మధ్య ఉండేటట్లు చూడడం
* నియమిత కాలంలో శరీరంలో చక్కెర స్థాయిలను సూచించే HbAic < 7 % కన్నా తక్కువ ఉండేటట్లు చూడడం
* మన శరీరంలో కొలెస్ట్రాల్ (రక్త నాళాలలో ఉండే కొవ్వు) < 150 mg/dl తక్కువగా ఉండేటట్లు చూడడం
* ఇక గుండె జబ్బు ఉన్న వారిలో LDL కొలెస్ట్రాల్ < 70 mg/dl కన్నా తక్కువగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు ఇతరులు LDL కొలెస్ట్రాల్ < 100 mg/dl కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి
* అలానే పురుషులలో HDL కొలెస్ట్రాల్ > 45 mg/dl కన్నా ఎక్కువ, మహిళలలో > 50mg/dl కన్నా ఎక్కువ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి
* చివరగా రక్త పోటు అంటే BP < 130/ 80 mmHg ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

డయాబెటిస్ నివారణ చర్యలు…
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనలలో డయాబెటిస్ తోపాటు దాని వలన ఏర్పడే పలు ఇతర ఇబ్బందులను పూర్తిగా నివారించవచ్చని స్పష్టమవుతోంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవడం వలన వీటిని పూర్తిగా నియంత్రించవచ్చు. అందుకే డయాబెటీస్ ఉన్న వారు వీటిపై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకొంటే ఈ ప్రమాదాలు రాకుండా చూసుకోవచ్చు. అందుకే డయాబెటీస్ నియంత్రణకు నాలుగు ప్రధాన స్థంభాల వంటి వాటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

* ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం
* వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం
* డయాబెటిస్ ను నిరంతరం గమనించుకొంటూ దీనితోపాటు రక్త పోటు, లిపిడ్స్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ
* డయాబెటిస్, దాని వలన ఏర్పడే ఇబ్బందులపై సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా

పైన పేర్కొన్న వాటితోపాటు బరువు తగ్గడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం అంటే తాజా పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ వలన వచ్చే ప్రమాదం నుండి పూర్తిగా తప్పించుకోవచ్చనేది వైద్య నిపుణులు అందిస్తున్న మంచి సమాచారం.

జట్టుగా పని చేస్తేనే డయాబెటిస్ ను నియంత్రించగలం…
డయాబెటిస్ నియంత్రణలో వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి, తగిన చికిత్స అందించడానికి దోహదపడేది దానిపై ప్రజలలో కలిగించే అవగాహన మాత్రమే. ఇలా విస్తృత స్థాయిలో అవగాహన కలిగించడానికి దీనిపై పని చేసే వైద్యులు (ఎండోక్రినాలజిస్టు, జనరల్ ఫిజిషియన్ లేదా డయాబెటాలజిస్టు) లతోపాటు నర్సులు, పీడియాట్రిస్టులు, న్యూట్రిషనిస్టులు వంటి వారు అందరూ కలసి కట్టుగా ఒక జట్టు రూపంలో పనిచేస్తేనే సాధ్యమవుతుంది.

దీని ప్రాముఖ్యతను వివరించడానికి 2020 సంవత్సరంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని “Nurses Make the Difference” అన్న నినాదంతో నిర్వహించారు. తద్వారా ఈ వ్యాధి నియంత్రణలో కేవలం వైద్యులే కాదు ఇతరత్రా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది పాత్ర కూడా కీలకమనే సందేశాన్ని అందించడానికి ప్రయత్నం జరిగింది. అందుకే ఈ వ్యాధిపై ప్రజలలో అవగాహన కలిగించడానికి సంబంధిత వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు కలసి పని చేసినపుడే దానిని నియంత్రణలో ఉంచగలుగుతాం.

డాక్ట‌ర్ రాకేష్ స‌హాయ్
MD, FICP, FACE, FRSSDI, Senior Consultant Endocrinologist, Aster Prime Hospital, Ameerpet, Hyderabad.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here