నమస్తే శేరిలింగంపల్లి : అడ్డా కూలీలుగా పనిచేసే ఇద్దరు వ్యక్తులు జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారారు. మియాపూర్ న్యూకాలనీ జాతీయ రహదారి సమీపంలో లారీని తస్కరించి మియాపూర్ పోలీసులకు దొరికిపోయారు. ఇద్దరి నుంచి రూ. 8 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి దుండిగల్ గ్రామానికి చెందిన నార్ల మల్లేశ్ (32), మియాపూర్ న్యూకాలనీకి చెందిన ముడావత్ శ్రీను (32) గత నాలుగేండ్లు గా స్నేహితులు. మియాపూర్లో అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. జల్సాలకు అలవాటుపడి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 1న రాత్రి మియాపూర్ న్యూకాలనీ జాతీయ రహదారి సమీపంలోని శివాలయం వద్ద పార్క్ చేసి ఉన్న లారీని దొంగిలించారు. 8న బాచుపల్లి రోడ్డులోని 7హిల్స్ డాబా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో మల్లేశ్, శ్రీనులను అదు పులోకి తీసుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు. దీంతో చోరీ గుట్టు బయట పడింది. నార్ల మల్లేశ్ 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్టు గుర్తించి, అతడితో పాటు శ్రీనును అరెస్టు చేశారు. లారీతో పాటు వాహనం కీలను వదిలివేయవద్దని సూచించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినందుకు మియాపూర్ ఎస్ హెచ్ ఓ ఎన్.తిరుపతిరావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ B. కాంత రెడ్డి, DSI B. జగదీశ్వర్, క్రైమ్ సిబ్బంది HC-శ్రీకాంత్, PC ప్రేమ్ కుమార్, బలరాం, పుల్యానాయక్, ప్రదీప్, సుభాష్ చంద్రబోస్, ప్రతాప్ రెడ్డి , సురేందర్, సాయి కృష్ణ, వరుణ్, WPC స్వప్న లను అదనపు డీసీపీ ఎన్. నర్సింహారెడ్డి, అసిస్టెంట్. కమీషనర్ కృష్ణ ప్రసాద్ , అభినందించారు.