- స్కూబా డైవర్ వినూత్న ఆలోచన
- పెళ్లి తేదీ, ముహూర్తం లేకుండానే శుభలేఖ
నమస్తే శేరిలింగంపల్లి: అందరిలాగా పెళ్లి పందిరి వేసి బంధువుల మధ్య వివాహ వేడుక జరుపుకోవడం రొటీన్ అనుకున్నాడో ఎమో గానీ ఓ స్కూబా డైవర్ తన అభిరుచికి అనుగుణంగా సముద్రంలో 60 అడుగుల లోతులో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కాడు. తమిళనాడులోని నీలన్ కరై తీరం ఈ వినూత్న వివాహానికి వేదికగా మారింది. ఈ విచిత్రమైన వివాహ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..!
తమిళనాడుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు వి.చిన్నదురై స్కూబా డైవింగ్ లో లైసెన్స్ కలిగి ఉన్నాడు. ఇతనితో పెళ్లి నిశ్చయమైన శ్వేతా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ ఇటీవలే స్కూబా డైవింగ్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అయితే వీరిరువురు వారి అభిరుచికి అనుగుణంగా సముద్రంలో 60 అడుగుల లోతులో వివాహం చేసుకోవాలనే వినూత్న ఆలోచన చేశారు. అయితే ఏ వివాహానికైనా ముహూర్తం పంచాంగం నిర్ణయిస్తే వీరి వివాహ సమయాన్ని సముద్ర అలలు నిర్ణయించాయి. స్కూబా డైవింగ్ కి సముద్ర వాతావరణం అనుకూలించకపోవడంతో వారం రోజుల ప్రయత్నం అనంతరం ఫిబ్రవరి 1వ తేదీన అలల సాక్షిగా, సముద్ర చేపల సమక్షంలో ఒక్కటయ్యారు. వివాహ వేడుకలో వధూవరుల బంధువులు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో 8 మంది స్కూబా డైవర్లు మాత్రం పాల్గొన్నారు. చిన్నదురై, శ్వేతలు సంప్రదాయ దుస్తులతో పాటు డైవింగ్ సూట్ ధరించి నిర్ణయించిన ప్రదేశానికి చేరుకోగా, ఉదయం 7:30 గం. లకు మంగళసూత్ర ధారణ జరిగింది.