అన్నమయ్యపురంలో పిసుపాటి లక్ష్మీ సౌందర్య బృందగానం

శేరిలింగంప‌ల్లి, మార్చి 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ కార్యక్రమం నిర్వహించగా, తదుపరి అన్నమయ్య స్వరార్చన భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా ప్రముఖ గాయని పిసుపాటి లక్ష్మీ సౌందర్య ఆధ్వర్యంలో శిష్యులు శ్రీవాణి అంబడపూడి, అన్నపూర్ణేశ్వరి జొన్న, విష్ణుభొట్ల వాసవి, రాచూరి సరిత శ్రీనివాస్, మాల్యవంతం రామలక్ష్మి, రాధిక బండం, చి. సృజన, శ్రావణి అపరోక్షం, నీలిమా మలే, బి. విజయలక్ష్మి, అనన్య నారాయణం, పెద్ది ఉమారాణి, ప్రభాల లలిత, భమిడిపాటి సుభద్ర శారద, వెంద్ర రాధ, శ్రీ శ్రేష్ఠ తదితరులు సంయుక్తంగా ఏమని నుతించవచ్చు, బలవంతుడు ఇతని, తోరణములే, ఆడరో పాడరో, వీడే వీడే కూర్చున్నాడు, రతి బతిమ సేసిన, బ్రహ్మమొక్కటే, అంతయు నీవే, చూడరమ్మ సతులాల, క్షీరాబ్ధి కన్యకకు అనే సంకీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

కాగా ఈ స్వరార్చనకు మృదంగంపై సర్వోత్తమ్ మరేమండ, వయోలిన్‌పై ధనుంజయ్ వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గాన బృందం భక్తి, సాహిత్య భావం, లయ సమన్వయంతో ఆలపించిన విధానం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచిందని తెలిపారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here