నమస్తే శేరిలింగంపల్లి: రేషన్ కార్డుదారులు ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ తో పాటు ఐరిస్ అప్డేట్ సేవలను స్థానిక తపాలా కార్యాలయాల్లో చేసుకోవచ్చని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్ర న్యాయస్థానం పౌరసరఫరా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కార్డుదారులు తమ ఆధార్ కార్డులో మార్పులు చేసుకునేందుకు వీలుగా హైద్రాబాద్ రీజియన్ పోస్టల్ శాఖ అధికారులు 124 ఆధార్ కేంద్రాలను, 15 మొబైల్ కేంద్రాలను, 28 గ్రామీణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు పోస్టల్ సిబ్బంది ద్వారా తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ కార్డు దారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, అపార్ట్ మెంట్లు, వెల్ఫేర్ అసోసియేషన్ వారికోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. పోస్టల్ కేంద్రాల్లో ఆధార్ సర్వీసులకు మంచి స్పందన లభిస్తుందని గత రెండు వారాల్లో 9885 మంది వినియోగదారులు తమ సేవలను ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులో ఐరిస్, మొబైల్ నెంబరు మార్చుకోవాల్సిన అవసరం ఉన్న కార్డు దారులు వెంటనే సమీప పోస్టల్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.