ఘనంగా మహా నగరం సంకీర్తన

శేరిలింగంప‌ల్లి, మార్చి 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ శోభా రాజు ఆధ్వర్యంలో 523వ‌ అన్నమయ్య ఆరాధన సందర్భంగా బహుల ద్వాదశి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం దగ్గర అన్నమయ్య ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ డాక్టర్ శోభరాజ్ గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రపంచమంతటా యుద్ధాలు, ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో విశ్వశాంతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని పేర్కొన్నారు. అందుకే విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజ‌రైన దిగ్గిల శేఖర్ బాబు సమృద్ధిగా సహాయం అందించినందుకు శోభారాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకరిస్తే స్కూల్స్, కాలేజీలు, విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయ‌న‌ రాక కార్యక్రమానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రపంచ శాంతి కోసం పద్మశ్రీ డాక్టర్ శోభరాజ్ రచించి స్వరపరచిన ఎన్నో కీర్తనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అందులో అప్పని వరప్రసాది, బహుళ‌ ద్వాదశి కొండల్లో నెలకొన్న, రాత్రి పగలు వంటి అనేక కీర్తనలు ఆమె విద్యార్థులతో ఎంతో అద్భుతంగా ఆలపింపజేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ముఖ్యంగా కొండల‌లో నెలకొన్న అనే ప్రసిద్ధి చెందిన కీర్తన సారాంశాన్ని కూడా ఎంతో చక్కగా వివరించారు.

ఆదిత్య పరాశీ స్వామీజీ మాట్లాడుతూ తమ ప్రసంగాలలో తరచుగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు కీర్తనల ప్రస్తావన వస్తుందని తెలిపారు. ఎక్కడైతే అన్నమాచార్య కీర్తనలు ఆలపించబడతాయో అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా కొలువై ఉంటారని పేర్కొన్నారు. అందువల్ల ఇలాంటి భక్తి కార్యక్రమాలు మరింతగా నిర్వహించబడాలని ఆకాంక్షించారు. అక్కడ పాడిన కళాకారులందరినీ అభినందిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింతగా కొనసాగుతూ మళ్లీ మళ్లీ జరగాలని ఆకాంక్షించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ డాక్టర్ శోభారాజ్ వినమ్రంగా కోరినట్లుగా స్కూల్స్, కాలేజీల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి తెలియజేస్తానని తెలిపారు. దీనికి కావలసిన సహాయాన్ని అందిస్తామని కూడా చెప్పారు. అలాగే నందినూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శోభారాజు పిల్లలకు పాటలు నేర్పించే విధానం ఎంతో అద్భుతమని అన్నారు. ఆ పిల్లలు పాడిన విధానాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here