- పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు : సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ దీప్తిశ్రీనగర్ హెచ్ ఎండీఏ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భూముల ఆక్రమణలకు యత్నిస్తున్న వారు పోలీసుల మీద దాడికి పాల్పడిన నేపథ్యంలో.. అవసరమైతే పీడీ యాక్ట్ లు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కబ్జాదారుల వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పోలీసులకు, కబ్జాదారుల మధ్య చిన్న తరహా యుద్ధమే జరిగింది. ఈ ఘటనలో కబ్జాదారులు పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి దిగి వారిని తరిమి కొట్టారు. ఈ ఘటనలో హెచ్ ఎండీఏ అధికారి రఘుకు గాయాలయ్యాయి.
దీంతో పెద్ద ఎత్తున పోలీసు బృందాలు ఘటనా స్థలానికి వచ్చి ఆందోళకారులను అక్కడి నుండి పంపించింది. మాదాపూర్ డీసీపీ వినీత్, అడిషనల్ డీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నరసింహారావు ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. ప్రజలు ఎవరూ సర్వే నెంబర్ 100, 101 లలోకి రావద్దని చెప్పారు. 144 సెక్షన్ ను అమలు చేస్తున్నామని, ఎవరైనా ఇక్కడికి వచ్చి గుమికూడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం పోలీసులపై జరిగిన దాడికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్న ఆయన దాడులకు తెగబడ్డ సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.