- గతంలో డివిజన్‌కు రెండు మసీదులకు రూ.2 లక్షలు, వెయ్యి ప్యాకెట్లు
- ఇప్పుడేమో డివిజన్ కు రూ.1 లక్ష, 250 ప్యాకెట్లు మాత్రమే
- కాంగ్రెస్ సర్కారులో మసీదుకో 50 ప్యాకెట్ల స్వాహా?
- పండుగకు మూడు రోజులే గడువు.. ఖాతాల్లో పడని ఇఫ్తార్ నిధులు
- సొంత ఇళ్లలో అధికార పార్టీ నేతల పంపిణీ.. చోద్యం చూస్తున్న అధికారులు
- తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి
శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ఇచ్చే కానుకల (తోఫా) పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిబంధనలను గాలికొదిలేసి అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ముస్లింలకు దక్కిన సముచిత గౌరవం కాంగ్రెస్ పాలనలో కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ఉదాసీనతను, కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ ఆమె జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

నాడు పండుగలా.. నేడు దండుగలా..
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ పండుగను రాష్ట్ర పండుగలా ఎంతో ఘనంగా నిర్వహించారని నవతారెడ్డి గుర్తుచేశారు. ఆనాడు ప్రతి డివిజన్‌కు రెండు మసీదులను ఎంపిక చేసి, ఇఫ్తార్ నిర్వహణ కోసం ఏకంగా డివిజన్ కు రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. అలాగే డివిజన్ కు 2 మసీదులకు 1000 రంజాన్ దుస్తుల ప్యాకెట్లను పేదలకు పంపిణీ చేసి ముస్లిం మైనార్టీల ముఖాల్లో ఆనందం చూశారన్నారు. ఆ పదేళ్ల పాలనలో ముస్లింలు ఎంతో సంతోషంగా, గర్వంగా పండుగ జరుపుకున్నారని కొనియాడారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. ఇప్పుడు డివిజన్‌కు కేవలం ఒక్క మసీదుకే పరిమితం చేశారని, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఆ ఒక్క మసీదుకు 300 ప్యాకెట్లు ఇవ్వాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో కేవలం 250 మాత్రమే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మిగతా 50 ప్యాకెట్లు కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్లాయా? లేక అధికారులే పక్కదారి పట్టించారా ? అని ఆమె నిలదీశారు.
నిధులు పడేది ఎప్పుడు.. పండుగ అయిపోయాకా?
రంజాన్ పండుగకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పటివరకు ఎంపిక చేసిన మసీదుల బ్యాంకు ఖాతాల్లో ఇఫ్తార్/డిన్నర్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఇస్తానన్న రూ. 1 లక్ష నగదు జమ కాలేదని నవతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ అయిపోయాక ఇఫ్తార్ నిధులు వేస్తారా? అసలు ఇంకెప్పుడు వేస్తారు అంటూ ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పేదల పండుగ సంతోషాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు.
సొంత ఇళ్లలో పంపిణీ.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారుల పర్యవేక్షణలో మసీదు కమిటీల ద్వారా పంపిణీ జరగాల్సి ఉండగా, చందానగర్, దీప్తిశ్రీ నగర్ డివిజన్లలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ కానుకలను తమ సొంత ఇళ్లలో, తమ సొంత జేబులోంచి ఇస్తున్నట్లుగా, ఏ హోదాలో పంపిణీ చ్చేస్తున్నారని ? అధికారులు ఏం చేస్తున్నారని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దీప్తిశ్రీ నగర్ డివిజన్ పరిధిలో అసలు ఏ మసీదుల్లో రంజాన్ తోఫా పంపిణీ చేశారు, ఆ డివిజన్ లో ఎందుకు చేయలేదు? మాయమైన ప్యాకెట్ల బాగోతం ఏమిటి? అన్న దానిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపాలని, పండుగలోపు మసీదుల ఖాతాల్లో ఇఫ్తార్ నిధులు జమ చేయాలని ఆమె జోనల్ కమిషనర్‌ను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముస్లింలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నవతారెడ్డి హెచ్చరించారు.





