- పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ దీప్తిశ్రీనగర్, ఎంఏ నగర్ హెచ్ ఎండీఏ భూముల ఆక్రమణకు యత్నించడంతో పాటు పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో బాధ్యులైన 50 మందిని గుర్తించామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ నరసింహారావులతో కలిసి వివరాలు వెల్లడించారు.
గత రెండు మూడు రోజులుగా సుమారు 2500 మంది జనాలు మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో గుమికూడి హెచ్ ఎండీఏ ఆధీనంలోని 450 ఎకరాలలో కబ్జాలకు తెగబడ్డారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు విసిరారని, కట్టెలతో దాడులు చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులతోపాటు హెచ్ ఎండీఏ అధికారి రఘు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఇదంతా కొందరు వ్యక్తులు కావాలనే చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం 50 మంది నిందితులను గుర్తించగా, అందులో 21 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నట్టు డీసీపీ వినీత్ తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 307, 333, 447, 147, 148, 120బి రెడ్ విత్149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.