నమస్తే శేరిలింగంపల్లి : రేగులకుంట చెరువుకు దశ దిశ మారిందని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలోని రేగులకుంట చెరువు సుందరీకరణలో భాగంగా సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెనీ సీఎస్ ఆర్ ఫండ్స్ నుంచి స్వచ్ఛందంగా రూ. 1 కోటి 50 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించి,పలు సూచనలు ,సలహాలు చేశారు.
మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన తాగునీటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. చెరువు సుందరీకరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెనీ ప్రతినిధులు చైతన్య తాళ్ళూరి, రాము, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజశేఖర్, అవినాష్, కాశీనాథ్ యాదవ్, సీతారామయ్య పాల్గొన్నారు.