చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా ఆదుకునే విధంగా పార్టీ మేనిఫెస్టో రూపొందించిందని, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం లో భాగంగా చందానగర్ డివిజన్ అభ్యర్థి అక్సారిబేగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అనే విషయం ఎన్నికల మేనిఫెస్టోలో నిర్దారణ అవుతుందన్నారు.
గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించడం తో పాటు వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల యజమానులకు 5 లక్షల నష్ట పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చి పేదలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికీ ఉచితంగా నీటి కనెక్షన్ అందించడం తో పాటు ప్రతీ నెలా 30 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.డి.నిజాముద్దీన్, రఘునందన్ రెడ్డి, రాజా పటేల్, రాజన్, పాషా, షబానా ఖాజా, జావేద్ హుస్సేన్, నందు, ప్రవీణ్, అమిత్ అగర్వాల్, గణేష్ ముదిరాజ్, రాజేష్ నాయక్, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.